అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖర్చు రూ. 175 కోట్లు.. ఎక్స్‌పెండిచర్ రిపోర్టు

  • రూ.117 కోట్ల ఖర్చుతో రెండో స్థానంలో బీజేపీ
  • రూ. 98 కోట్లు ఖర్చుతో మూడో స్థానంలో కాంగ్రెస్
  • కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీల ఖర్చు రిపోర్ట్
  • అనధికారిక ఖర్చు వాస్తవ ఖర్చుకు ఎన్నో రెట్లు అధికం!
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఏకంగా రూ. 175 కోట్లు ఖర్చు చేసిందట. అయినప్పటికీ ఆ పార్టీకి విజయం అందకుండా పోయింది. రూ. 117 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ఖర్చు విషయంలో రెండో స్థానంలో నిలవగా, రూ. 98 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ‘ఎక్స్‌పెండిచర్ రిపోర్టు’లో ఆయా పార్టీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమేనని, వాస్తవ ఖర్చులు ఇంకా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రచారంలో ఓటర్లకు పంచిన డబ్బులు, పార్టీలు, మద్యం వంటి వాటికి చేసిన ఖర్చులు కూడా కలుపుకొంటే ఈ లెక్క మరెన్నో రెట్లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుకు సీలింగ్ ఉన్నప్పటికీ, పార్టీ చేసే ఖర్చులకు పరిమితి లేకపోవడంతో ఖర్చులకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విమర్శలు ఉన్నాయి. బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్‌ల ఏర్పాటు వంటివన్నీ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. 

బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీలన్నీ ఫండ్ ఇవ్వడం మామూలు విషయమే. బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షలు, కాంగ్రెస్ రూ. 30 లక్షలు, బీజేపీ రూ. 25 లక్షల చొప్పున అందించాయి. ఈ మొత్తాన్ని పార్టీ సెంట్రల్ ఫండ్ నుంచి సమకూర్చినట్టు పార్టీలు తమ రిపోర్టులో పేర్కొన్నాయి. అలా మొత్తంగా బీఆర్ఎస్ రూ. 47.60 కోట్లు, కాంగ్రెస్ రూ. 35.40 కోట్లు, బీజేపీ రూ.27.50 కోట్లు అభ్యర్థులకు ఇచ్చినట్టు తెలిపాయి.


More Telugu News