తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  • టోకెన్లు లేకుండా వచ్చిన వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
  • టోకెన్లతో వచ్చిన వారికి 5 గంటల్లో దర్శనం పూర్తి
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. 

టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టోకెన్లతో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉండగా... దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

నిన్న వెంకటేశ్వరస్వామిని 75,916 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,920 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది.


More Telugu News