పదకొండేళ్ల చిన్నారికి ప్రేమ లేఖలు రాసిన టీచర్.. అమెరికాలో ఘటన

  • 60 కి పైగా లవ్ లెటర్లు.. పలు కానుకలు ఇచ్చి కౌగిలించుకున్న ప్రబుద్ధుడు
  • బాలిక ఇంటికి, ఆమె వెళ్లే చర్చ్ కు వెళుతూ చనువు పెంచుకునేందుకు యత్నం
  • ‘టీచర్ ఆఫ్ ది ఇయర్’ అందుకున్న వ్యక్తి ఇలా చేశాడని తోటి టీచర్ల ఆశ్చర్యం
పవిత్రమైన గురువు స్థానంలో ఉన్న ఓ ప్రబుద్ధుడు తన విద్యార్థినికి ప్రేమ లేఖలు రాశాడు.. కానుకలు ఇస్తూ కౌగిలించుకుంటూ వేధింపులకు పాల్పడ్డాడు. క్లాస్ రూంలో ఉన్నపుడు, స్కూలు ఆవరణలో ఉన్నపుడు ఫొటోలు తీసి దాచుకున్నాడు. స్కూలుకు రాకపోవడంతో బాలిక వెళ్లే చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ విషయం గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు చేరవేయడంతో డిటెక్టివ్ లు రంగంలోకి దిగి సదరు టీచర్ అసలు రూపాన్ని బయటపెట్టాడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో చోటుచేసుకుందీ ఘటన.

సౌత్ కరోలినాలోని స్టార్ ఎలిమెంటరీ స్కూల్ లో డ్యూక్ టీచర్ గా పనిచేస్తున్నాడు. తన స్కూల్ లో చదివే ఓ పదకొండేళ్ల బాలికకు ప్రేమిస్తున్నానంటూ లెటర్లు రాస్తూ వేధించాడు. దాదాపు అరవైకి పైగా లెటర్లు రాయడంతో పాటు పలు బహుమతులు ఇస్తూ కౌగిలించుకునేవాడు. బాలికతో చనువు పెంచుకోవడానికి వారి ఇంటికి కూడా తరచూ వెళ్లేవాడు. కూతురు చదివే స్కూలు టీచర్ కావడంతో బాలిక పేరెంట్స్ మరోరకంగా ఆలోచించలేకపోయారు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న డ్యూక్.. బాలిక ఫ్యామిలీతోనూ చనువుగా మెలగడం మొదలుపెట్టాడు.

బాలిక స్కూలుకు రాకపోవడంతో ఇంటికి, బాలిక వెళ్లే చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్కూలులో డ్యూక్ వస్తువులను, క్యాబిన్ ను డిటెక్టివ్ గాలించగా.. బాలికకు సంబంధించిన పలు ఫొటోలు బయటపడ్డాయి. అయితే, అవేవీ అసభ్యకరంగా లేవని పోలీసులు చెప్పారు. దీంతో డ్యూక్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

కోర్టులో నిందితుడి తరఫు లాయర్ వాదిస్తూ.. తన క్లయింట్ డ్యూక్ గతేడాది ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడని జడ్జికి తెలిపాడు. పర్సనల్ బాండ్, పూచీకత్తుతో విడుదల చేయాలని కోరాడు. అయితే, బాలిక తండ్రి దీనికి అభ్యంతరం చెప్పాడు. డ్యూక్ తన ఇంటికి కూడా తరచూ వచ్చేవాడని, అతడి మనసులోని దురుద్దేశం తెలియక తాము అభ్యంతరం పెట్టలేదని చెప్పారు. ఇప్పుడు నిందితుడిని వదిలిపెడితే తమ కూతురికి, తమ కుటుంబానికి హాని తలపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, దీనిపై నిందితుడిని జడ్జి హెచ్చరించారు. జైలు నుంచి విడుదల చేస్తే బాలికను కానీ, ఆమె కుటుంబాన్ని కానీ కలిసేందుకు ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు. న్యాయ వర్గాల సమాచారం మేరకు ఈ కేసు విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది.


More Telugu News