సెలబ్రెటీలు తాగే పాలు ఇవే.. భాగ్యలక్ష్మీ డెయిరీ

  • అమితాబ్ బచ్చన్ నుంచి అంబానీ దాకా ఖాతాదారులే
  • ఏసీలో ఆవులు.. సేంద్రీయ పద్ధతిలో గడ్డి పెంపకం
  • ఆవును పరీక్షించి ఆరోగ్యంగా ఉంటేనే పాలు పితకడం
  • దేశంలోనే అతిపెద్ద డెయిరీలలో ఒకటిగా గుర్తింపు
బాలీవుడ్ సెలెబ్రెటీల నుంచి బిజినెస్ టైకూన్ల దాకా.. ప్రముఖుల ఇళ్లల్లో నిత్యం వాడే పాలు మహారాష్ట్రలోని భాగ్యలక్ష్మి డెయిరీ నుంచే వెళుతుంటాయి. అమితాబచ్చన్ కుటుంబం, ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ, హృతిక్‌ రోషన్‌, శిల్పాశెట్టి, సల్మాన్‌ ఖాన్‌ సహా చాలామంది సెలెబ్రెటీలు ఈ డెయిరీ పాలను ఇష్టపడుతుంటారు. స్వచ్ఛత, ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఆవుల నుంచి పాలను సేకరించడమే దీనికి కారణం. అంతేనా.. ఆవుల పెంపకం నుంచి వాటికి వేసే గడ్డి పెంపకంపైనా అత్యంత శ్రద్ధ తీసుకుంటారట. ఈ డెయిరీలో ఉన్న ఆవులు ప్రపంచంలోనే పేరొందిన మేలురకం జాతికి చెందినవి, వీటి పాలల్లో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని మంచాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ డెయిరీకి మూలపురుషుడు దేవేందర్ షా.. హైటెక్ పద్ధతులతో, సెంట్రలైజ్డ్ ఏసీతో నిర్వహించే ఈ డెయిరీ ఆర్గానిక్ పాలను ఉత్పత్తి చేస్తుంటుంది.

50 ఎకరాల్లో 4 వేల ఆవులతో..
పాలను ఫ్రెష్ గా వినియోగదారుడికి అందించే ఉద్దేశంతో ఈ డెయిరీ ప్రారంభించినట్లు దేవేందర్ షా చెప్పారు. అందుకే మిగతా డెయిరీల మాదిరిగా కాకుండా ఒకే జాతికి చెందిన ఆవులను ఎంచి విదేశాల నుంచి తెప్పించినట్లు వివరించారు. పూణెకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాల్లో ఉన్న ఈ డెయిరీలో దాదాపు 4 వేలకు పైగా హోల్ స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవులు ఉన్నాయి. వేల సంఖ్యలో ఆవులు ఉన్నప్పటికీ డెయిరీ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీలో డెయిరీ సిబ్బంది ఆవులను కంటికిరెప్పలా చూసుకుంటుంటారు. వాటికి ఆహారం కోసం పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో గడ్డిని పెంచుతారు.

ఆవులకు వాకింగ్..
బరువు అధికంగా ఉన్నఆవులతో రోజుకు మూడు కిలోమీటర్లు వాకింగ్‌ చేయిస్తారు. రోజంతా మంద్రమైన సంగీతం వినిపించే ఏర్పాట్లు చేశారు. అంతేనా.. ఆవులు పడుకోవడానికి రబ్బరు బెడ్లు, తాగడానికి ఆర్వో వాటర్, 50 మంది వైద్య సిబ్బంది, పేడ, మూత్రం తొలగించడానికి 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతిపూటా ఆవులను పరీక్షించి, ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచే పాలను సేకరిస్తారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా పాలు పితకరు. ఒక్కో ఆవు రోజూ 25 నుంచి 30 లీటర్ల వరకు పాలిస్తుంది. ఈ పాలల్లో అధిక ప్రొటీన్లు, మైక్రోన్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఫ్యాట్ ఉంటాయి. 

అంతా ఆటోమేటిక్..
ఆవుల నుంచి సేకరించే క్రమంలో ఎక్కడా పాలను తాకే అవకాశం లేదు. పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో సేకరిస్తారు. ఆవు పొదుగుకు పైపులను అమర్చి యంత్రాల సాయంతో పాలు పితుకుతారు. పైపుల ద్వారా పాలు నేరుగా ట్యాంకర్ లోకి, అక్కడి నుంచి బాటిళ్లలో నింపి బయటకు వస్తాయి. వీటిని డైరెక్ట్ గా వినియోగదారులకు అందిస్తారు. ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో విక్రయించే భాగ్యలక్ష్మి డెయిరీ పాలను సినిమా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇష్టంగా తాగుతుంటారు. ముంబై, పూణే, గుర్ గావ్, బెంగళూరు, చెన్నైలలోని సుమారు 20 వేలమంది వినియోగదారులకు రోజూ పాతికవేల లీటర్ల పాలను ఈ డెయిరీ సరఫరా చేస్తోంది. పెరుగు, వెన్న, పనీర్, చీజ్ వంటి పాల పదార్థాలను కూడా అమ్ముతూ ఏటా ఈ కంపెనీ వెయ్యికోట్ల పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది.


More Telugu News