ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు కానీ రోహిత్‌ను నేనే కెప్టెన్‌ చేశానన్న విషయం మరిచారు : గంగూలీ

  • 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘోర పరాజయం
  • విరాట్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
  • విరాట్‌‌ను కాదని కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించడంపై విమర్శలు
  • నాటి పరిణామాలను మరోసారి గుర్తు చేసుకున్న గంగూలీ
టీమిండియా గెలుపు సంబరాలు చేసుకుంటున్న వారు జట్టు సారథి రోహిత్ ను గతంలో కెప్టెన్‌గా ఎంపిక చేసింది తానేనన్న విషయం మర్చిపోయారని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఓ బెంగాలీ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శకులపై ఫైరయ్యాడు. 2021లో టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమణ తరువాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఘోరంగా విఫలమైన టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. టీమిండియా ఫ్యాన్స్ అప్పట్లో గంగూలీని విపరీతంగా ట్రోల్ చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కోహ్లీ కూడా మండిపడ్డాడు. తనకు ఇష్టం లేకపోయినా వన్డే టీం బాధ్యతలు వదులుకోవాల్సి వచ్చిందన్నాడు. కానీ తాను, కోహ్లీ పరస్పర అంగీకారానికి వచ్చిన తరువాతే అతడిని తప్పించామని గంగూలీ చెప్పుకొచ్చాడు. 

కాగా, నాటి విషయాలను గుర్తు చేస్తూ సౌరవ్ గంగూలీ విమర్శకుల నోళ్లకు తాళం వేసే ప్రయత్నం చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ గెలుపును అంతా ఆస్వాదిస్తున్నారు కానీ నాడు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది తానేన్న విషయం అంతా మర్చిపోయారని అన్నాడు. 

‘‘రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు అతడి సారథ్యంలోనే టీమిండియా కప్పు గెలిచింది కాబట్టి విమర్శలకు బ్రేకులు పడ్డాయి. కానీ, అతడిని తొలుత కెప్టెన్‌గా ఎంపిక చేసింది నేనే అన్నది అందరూ మర్చిపోయారనిపిస్తోంది’’ అని అన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్ టీంకు డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ టీం కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించాడు. రికీ పాంటింగ్ నిష్క్రమణ తరువాత కోచ్ బాధ్యత చేపట్టాలని తాను అనుకున్నట్టు చెప్పాడు. ‘‘తదుపరి ఐపీఎల్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈసారీ డీసీ గెలవాలని కోరుకుంటున్నా. హెడ్ కోచ్ నియామకం గురించి టీం మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలనుకుంటున్నా. హెడ్‌ కోచ్‌గా నేనోసారి ప్రయత్నించాలనుకుంటున్నా. జట్టులోకి కొత్త ప్లేయర్లను తీసుకొస్తా. ఇంగ్లండ్ నుంచి జేమీ స్మిత్‌ను జట్టులోకి తేవాలని భావిస్తున్నా. అతడూ వద్దామనుకున్నాడు కానీ షెడ్యూల్స్ కుదరలేదు’’ అని చెప్పుకొచ్చాడు.


More Telugu News