ఇలాంటి కేసులు జగన్ కు ఓ లెక్కా?: కాకాణి

  • రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం చేశారంటూ కేసు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
  • ఏ3గా మాజీ ముఖ్యమంత్రి జగన్
  • జగన్ పై దొంగ ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న కాకాణి
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై గత ప్రభుత్వ హయాంలో హత్యాయత్నం చేశారన్న కేసులో జగన్ ను ఏ3గా పేర్కొనడం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. 

జగన్ పై కేసు నమోదు చేసి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఈ కేసుతో జగన్ కు అసలు సంబంధమే లేదని, అయినా కక్షపూరితంగా ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని ఆరోపించారు. గతంలో ఇలాంటి కేసులను, సంక్లిష్ట పరిస్థితులను జగన్ ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని కాకాణి స్పష్టం చేశారు. 

"రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ 40 రోజుల్లో అభివృద్ధి మాట పక్కనుంచితే... విధ్వంసం సృష్టించడం, వైసీపీ నేతలపై దాడులు, హత్యలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ఆస్తులు బలవంతంగా లాక్కోవడం... ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విధ్వంసానికి పరాకాష్ఠగా అనేక రకాలైన తప్పుడు కేసులు పెడుతూ, వైసీపీ వాళ్లను జైలుకు పంపుతున్నారు. తద్వారా చంద్రబాబు, ఇతర కూటమి భాగస్వాములు పైశాచిక ఆనందం పొందుతున్నారు. 

ఇవాళ ప్రతిపక్ష నాయకుడైన జగన్ పై సంబంధం లేని కేసును మోపి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే పోలీసులు జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. 

అది ఎప్పుడో జరిగిన ఘటన. అనేక కోర్టులను దాటి సుప్రీం కోర్టు వరకు ఆ ఘటన వెళ్లినా, అందులో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగా, జనాలను భయభ్రాంతులకు గురిచేయడానికి, అందరిపై కేసులు నమోదు చేస్తాం అని చెప్పడానికి ఈ రోజు చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఇది ఒక మాయని మచ్చ. 

ఇలాంటి కేసులు జగన్ కు కొత్త కాదు. అనేక సందర్భాల్లో ఆయనపై కేసులు పెట్టారు. అవన్నీ దాటుకుని జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు కూడా వీటిని అధిగమించగల శక్తి, స్తోమత, స్థైర్యం జగన్ కు ఉన్నాయి. 

కాకపోతే, ఇలాంటి చర్యల వల్ల చంద్రబాబు ప్రజల్లో మరింత అవహేళన పాలవుతారు. రాష్ట్రంలోని ప్రతి వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు జగన్ కు అండగా ఉన్నారు. జగన్ పై నమోదు చేసిన దొంగ ఎఫ్ఐఆర్ ను వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు" అని కాకాణి పేర్కొన్నారు.


More Telugu News