భారతి గారు అన్నారంటే అది డిఫరెంట్ మ్యాటర్: అంబటి రాంబాబు

  • తల్లికి వందనం పథకంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • నిమ్మల వీడియోపై వైసీపీ నేతల సెటైర్లు
  • వైఎస్ భారతి వీడియోను తెరపైకి తెచ్చి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు
  • ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన అంబటి రాంబాబు
తల్లికి వందనం పథకంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు వైఎస్ భారతి వీడియోను తెరపైకి తీసుకురావడం పట్ల ఆయన స్పందించారు. 

ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి, ఆ తర్వాత విస్మరించే వ్యక్తి పేరు నారా చంద్రబాబునాయుడు అని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో అమలు చేయకుండా, అధికారంలోకి వచ్చిన ఈ నెలా పది రోజుల్లోనే ఎన్ని దుర్మార్గాలు చేశారో చూడండి అంటూ ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడం ఏంటని నిలదీశారు. మేనిఫెస్టోలో ఉన్న పథకాన్ని అమలు చేయకుండా, రెడ్ బుక్ పేరుతో తమపైనే ప్రతీకార దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

"మా పార్టీ ఆఫీసులు కూల్చేస్తారా... తప్పుడు  జీవోలు ఇచ్చి మా ప్రజలను ఇబ్బంది పెడతారా... మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెడతారా... ఎమ్మెల్యేలపైనా, మాజీ ఎమ్మెల్యేలపైనా కేసులు పెట్టి లోపల తోస్తారా... కక్ష సాధింపులు ఉండవు అన్నారు... ఆ మాటకు అర్థం ఇదేనా...? 

కక్ష సాధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి రెండో పనే లేదు. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ దుర్మార్గమైన పాలన ఇంకా నాలుగు సంవత్సరాలు 11 మాసాలు భరించాలా? అనే పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభమయ్యే విధంగా నారా లోకేశ్ గారు చక్కని ప్రోగ్రామ్ నిర్ణయించారు... చాలా సంతోషం! 

రెడ్ బుక్ అమలు చేయాలి అంటూ గుంటూరులో పెద్ద పెద్ద పోస్టర్లు కనిపిస్తున్నాయి. కేసులు పెట్టి మమ్మల్నందరినీ లోపల వేయండి చూస్తాం. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. 

తల్లికి వందనంపై మేం అడుగుతున్నామని భారతి గారి వీడియో తీసుకువచ్చారు. ఆ వీడియో పక్కనబెట్టి... 2019 ఎన్నికల్లో మా మేనిఫెస్టో ఏంటో చూడండి, ఈ ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టో ఒక్కసారి చూడండి. 

కూటమి మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అన్నారు... మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి రూ.15 వేలు అని అన్నాం.... తేడా ఉంది కదా. భారతి గారు అన్నారు, రాంబాబు గారు అన్నారు అంటే అది డిఫరెంట్ మ్యాటర్. 

ఇదే విషయం షర్మిల గారు కూడా అన్నారు... ఆమెది వేరే విషయం. వదిన గారి మీద ఉన్న కోపమో, అన్న గారి మీద ఉన్న కోపమో... కుటుంబ కారణాల వల్ల ఆమె చంద్రబాబును సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు" అంటూ అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News