తల్లికి వందనంపై వైసీపీ విమర్శలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్

  • తల్లికి వందనం పథకానికి స్వస్తి పలుకుతున్నారంటూ వైసీపీ విమర్శలు
  • తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులే అయిందన్న నిమ్మల
  • తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ ఫైర్
టీడీపీ కూటమి తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి స్వస్తి పలికామంటూ అవాస్తవాలు రాస్తున్నారని అన్నారు. 

తాను ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు ప్రెస్ మీట్లలో ప్లే చేస్తుండడం పట్ల నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ భారతి కూడా అమ్మ ఒడిపై ఇదే రీతిలో ప్రచారం చేస్తున్న వీడియోను నిమ్మల తన ప్రెస్ మీట్ లో ప్లే చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులే అయిందని, పథకం అమలుకు విధివిధానాలపై ఆలోచిస్తున్నామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ఓ పండుగలా నిర్వహిస్తామని, ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ఉద్ఘాటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తమది అని అన్నారు. 

తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైసీపీది... తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 

ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి, అందులోనూ తగ్గించారని, అది కూడా 2020 నుంచి ఇచ్చారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఒక ఏడాది అమ్మ ఒడి ఎగ్గొట్టారు అని తెలిపారు.


More Telugu News