ఉన్నతాధికారులను డమ్మీలుగా మార్చేసి ఎస్సైలకు నేరుగా సీఎంవో నుంచి ఆదేశాలు ఇచ్చేవారు: పీవీ రమేశ్

  • గ్రామాలపై నిఘా కోసం వాలంటీర్లు, సచివాలయాలు ఏర్పాటు చేశారన్న పీవీ రమేశ్
  • జగన్ సామ్రాజ్యానికి రక్షణలా భావించారని వెల్లడి
  • సీఎంవో నుంచి ఓ వ్యక్తి ఈ వ్యవస్థను నియంత్రించేవారని స్పష్టీకరణ
గ్రామాలపై నిఘా ఉంచేందుకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ఏపీలో వాలంటీర్లు, సచివాలయాలు ఏర్పాటు చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పీవీ రమేశ్ మాట్లాడుతూ... పోలీసులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను జగన్ సామ్రాజ్యానికి రక్షణ వ్యవస్థగా భావించారని ఆరోపించారు. 

ఉన్నతాధికారులను డమ్మీలుగా మార్చేసి... క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్సైలకు సీఎంవో నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లేవని అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని వెల్లడించారు. 

"కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు... విలేజ్ అసిస్టెంట్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు... ఒక్కొక్కరి కులం ఏమిటి, మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి, వాళ్ల రాజకీయ పలుకుబడి ఏమిటి అని వాళ్ల నేపథ్యం రాసుకున్నారు. ఒక నెలరోజుల్లో కిందా మీదా పడి అందరినీ మార్చేశారు. వీళ్లందరినీ నియంత్రించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు.  ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఫోన్ చేసి ఎస్సైతో మాట్లాడతారు... మీరు సాయంత్రంలోగా చేస్తారా, లేదా? మీరేం చేశారో మాకు రిపోర్ట్ చేయండి అని ఆ ఎస్సైకి చెప్పేవారు. సాయంత్రంలోగా ఆ సబ్ ఇన్ స్పెక్టరే సీఎం ఆఫీసుకు ఫోన్ చేయాలి. మళ్లీ డీజీపీ గారికి ఏమీ తెలియదు.

ఇది కాకుండా, వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకువచ్చారు. 2016 డిసెంబరు నుంచి ఐప్యాక్ వ్యవస్థలో పనిచేసి, 2019 ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలుగా బూత్ లెవల్ లో పనిచేసిన వారిని, 2019 ఆగస్టులో వాళ్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి గౌరవ వేతనంగా ఏటా రూ.2500 కోట్లను ప్రభుత్వం నుంచే జీతాలు చెల్లించేవారు. 

వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మరో 1.50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఒక్కో సచివాలయంలో 13 మంది ఉద్యోగులు ఉంటారు. గ్రామాల్లో ప్రజలు ఏం చేస్తున్నారో చూడడానికి, వారిని నియంత్రించడానికి వీళ్లను ఉపయోగించుకున్నారు" అని పీవీ రమేశ్ వివరించారు.


More Telugu News