బస్సులను పెంచుతున్నాం... 1,000 బస్సులను కొనుగోలు చేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • మరో 1,500 బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడి
  • దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్న మంత్రి
  • ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామన్న మంత్రి
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ-హైదరాబాద్ నాన్‌స్టాప్ ఏసీ, 3 డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని గుర్తు చేశారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.


More Telugu News