ఉపఎన్నికల్లో హిమాచల్ ముఖ్యమంత్రి భార్య ఘన విజయం

  • బీజేపీ అభ్యర్థిపై 9 వేల ఓట్ల మెజార్టీతో కమలేశ్ ఠాకూర్ విజయం
  • హిమాచల్ ప్రదేశ్‌లో 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
  • ఒకచోట బీజేపీ, మరోచోట కాంగ్రెస్ ముందంజ
హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు భార్య కమలేశ్ ఠాకూర్ ఘన విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్‌పై 9 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి హోష్యార్ సింగ్ దాదాపు 4 వేల ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మూడు నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ ఓ స్థానంలో గెలవగా, మరో స్థానంలో ముందంజలో ఉంది. ఓ నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉంది.

ప్రజలు బుద్ధి చెప్పారు

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకు 40 సీట్లు ఇచ్చారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారికి ప్రజలు ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. ప్రజాప్రతినిధుల కొనుగోలును తాము సహించేది లేదని ఈ ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీతో అంటకాగి... రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారన్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. దీనిని ప్రజలు గమనించారని పేర్కొన్నారు.


More Telugu News