అనంత్ అంబానీ పెళ్లి రిసెప్షన్‌కు సీఎం చంద్రబాబు

  • శనివారం రాత్రి ముంబైలో జరగనున్న రిసెప్షన్
  • కార్యక్రమానికి హాజరై రాత్రికి ముంబైలోనే బస చేయనున్న ఏపీ సీఎం
  • ఆదివారం మధ్యాహ్నం తిరుగుపయనం
  • పెళ్లికి హాజరయ్యేందుకు శుక్రవారమే ముంబై చేరుకున్న మంత్రి నారా లోకేశ్
ప్రపంచ సంపన్నుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. ఇవాళ (శనివారం) రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు.

కాగా అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం ముంబై వెళ్లారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

14న గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాట్లు..
కొన్ని నెలలుగా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగియడంతో ఇక విందు కార్యక్రమం ఒక్కటే మిగిలింది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.


More Telugu News