ఈ అవార్డు సాధించిన ఏపీసీఎన్ఎఫ్, రైతు సాధికార సంస్థకు అభినందనలు: చంద్రబాబు

  • ఏపీ ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ అవార్డు
  • గుల్బెంకియన్ అవార్డు అందుకున్న ఏపీసీఎన్ఎఫ్, రైతు సాధికార సంస్థ
  • ఏపీ ప్రకృతి సాగుకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్న చంద్రబాబు
ఏపీ ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2024 సంవత్సరానికి గాను ఏపీ ప్రకృతి వ్యవసాయం ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ అవార్డు కైవసం చేసుకుంది. 

పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో... ఏపీసీఎన్ఎఫ్ (ఏపీ ప్రకృతి సేద్యం సమాఖ్య), రైతు సాధికార సంస్థ, ప్రకృతి సాగు రైతు నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు. భారత సంతతి అమెరికన్ సైంటిస్టు రతన్ లాల్, ఈజిప్టు స్వచ్ఛంద సంస్థ సెకెమ్ కూడా ఈ అవార్డు అందుకోగా... విజేతలకు అందించే 1 మిలియన్ యూరోలను (రూ.9.09 కోట్లు) ఏపీ బృందానికి, రతన్ లాల్ కు, సెకెమ్ సంస్థకు సమంగా పంచనున్నారు. 

ఏపీ ప్రకృతి సేద్యానికి విశిష్ట పురస్కారం లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రకృతి సేద్యం సమాఖ్య, ఏపీ రైతు సాధికార సంస్థకు గుల్బెంకియన్ అవార్డు దక్కడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఏపీ చేపట్టిన జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని సంతోషం వెలిబుచ్చారు.


More Telugu News