జగన్ సీఎం అయ్యాక ఏపీలో నేతన్నలకు మరణ శాసనం రాశారు: మంత్రి సవిత

  • వైసీపీ పాలనలో ఆప్కోలో జరిగిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్న సవిత
  • స్వలాభం కోసం ఆప్కో చేనేత కార్మికులను నాశనం చేశారని విమర్శలు
  • వైసీపీ కార్యకర్తలకే నేతన్న నేస్తం ఇచ్చారని ఆరోపణ
  • దెబ్బతిన్న చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత నేడు చేనేత రంగం, ఆప్కో అంశాలపై స్పందించారు. జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణశాసనం రాశారని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఆప్కోలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. 

ఆప్కో చేనేత కార్మికులను స్వలాభం కోసం నాశనం చేశారని విమర్శించారు. ఉపాధి లేక చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస పోయే పరిస్థితిని తీసుకువచ్చారని మంత్రి సవిత మండిపడ్డారు. నేతన్న నేస్తం పేరుతో వైసీపీ కార్యకర్తలకే ప్రయోజనం కలిగించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకే పెద్దపీట వేశారని అన్నారు. 

ఏపీలో చేనేత రంగం నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం దెబ్బతిన్న చేనేత రంగాన్ని గాడినపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని సవిత స్పష్టం చేశారు. 

కూటమి పాలనలో చేనేత కార్మికులకు సబ్సిడీపై ముడిసరుకు, పనిముట్లు అందిస్తున్నామని వెల్లడించారు. సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి లబ్ధి చేకూర్చుతామని చెప్పారు.


More Telugu News