ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటించిన కేంద్రం

  • ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్రమంత్రి అమిత్ షా
  • ఎమర్జెన్సీని విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్న కేంద్రమంత్రి
  • ప్రజాస్వామ్యం గొంతును, మీడియా గొంతును నొక్కేశారన్న అమిత్ షా
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. కేంద్రమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమర్జెన్సీని విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైళ్లలో పెట్టారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియా గొంతు కూడా నొక్కారన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల నాటి అమానవీయ హింసను భరించిన వారందరికీ ప్రతి సంవత్సరం ఆ రోజు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.

1975 జూన్ 25న ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయికస్థితిని విధించి ప్రజాస్వామ్యం గొంతును నులిమేశారన్నారు. కారణం లేకుండానే లక్షలాది మందిని జైల్లో పెట్టారన్నారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ప్రతి సంవత్సరం రాజ్యాంగ హత్యా దినంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


More Telugu News