తల్లికి వందనంపై చంద్రబాబు మాటను నిలబెట్టుకోవాలి: గుడివాడ అమర్ నాథ్

  • విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్న అమర్ నాథ్
  • సూపర్ సిక్స్ ఎటు వెళ్లిందని ప్రశ్న
  • టన్ను ఇసుకకు రూ. 1,400 తీసుకుంటున్నారని విమర్శ
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉందని చెప్పారు. తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి రూ. 15 వేలు ఇస్తామని ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. సూపర్ సిక్స్ ఎటు వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. 

విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం అంటూ చంద్రబాబు చెపుతున్న మాటలను తాను చిన్నప్పటి నుంచి వింటున్నానని అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. ఉచితం అని చెపుతూ... అన్ని ఛార్జీలు కలిపి టన్నుకు 1,400 తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి జరగాలనేదే తమ ఆశయమని చెప్పారు. 

తమ అధినేత జగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అమర్ నాథ్ అన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరగడానికి తాము ఎంతో కృషి చేశామని, రైతులను ఒప్పించి భూసేకరణ చేశామని... తమ కృషిని కూటమి ప్రభుత్వ అకౌంట్ లో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవిష్యత్తు కార్యక్రమాల గురించి చెప్పకుండా... జగన్ పై విమర్శలు గుప్పించడం దారుణమని అన్నారు.


More Telugu News