సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్య గోచరంగా మారిందని విమర్శ
  • విద్య, ఉపాధి పథకాలు ఆగిపోవడం విచారకరమని వ్యాఖ్య
  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం కేసీఆర్ ఏటా రూ.100 కోట్లు కేటాయించారన్న హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. పేద బ్రాహ్మణులకు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. సంక్షేమ పరిషత్‌ ద్వారా అమలుచేసే పథకాలు నిలిచిపోయయన్నారు.

బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. కానీ ఇప్పుడు, విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో అసలు బ్రాహ్మణ పరిషత్‌ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజికవర్గంలో నెలకొన్నదన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం కేసీఆర్ ఏటా రూ.100 కోట్లు కేటాయించారని, 'వివేకానంద' పేరుతో విదేశీ విద్యా పథకం, 'శ్రీ రామానుజ' పేరుతో ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం, 'వేదహిత' పేరుతో వేద పాఠశాలలకు, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.


More Telugu News