ఆ ఘనత కెప్టెన్ రోహిత్ శర్మ బృందానికే చెందుతుంది: వీవీఎస్ లక్ష్మణ్

  • వరల్డ్ కప్ గెలుపులో ఆటగాళ్ల నుంచి కోచింగ్ సిబ్బంది వరకు అందరూ కష్టపడ్డారంటూ మెచ్చుకోలు
  • ఆత్మవిశ్వాసంతో ఆడారని కొనియాడిన తాత్కాలిక కోచ్
  • భారత జట్టు స్వభావం ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్ ద్వారా స్పష్టమవుతోందని వ్యాఖ్య 
టీ20 వరల్డ్ కప్ 2024ను భారత్ గెలుచుకోవడంపై టీమిండియా తాత్కాలిక కోచ్‌ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఈ వరల్డ్ కప్ సాధించిన ఘనత కెప్టెన్ రోహిత్ శర్మ బృందానికే చెందుతుందని ప్రశంసించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచు నుంచి టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించేందుకు రోహిత్ సేన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడిందని మెచ్చుకున్నాడు. వరల్డ్ కప్‌ విజయాన్ని భారత ఆటగాళ్లు ఆస్వాదించిన తీరుని బట్టి వారు ఎంతగా శ్రమించారో అర్థమవుతోందని,  ఆటగాళ్ల నుంచి కోచింగ్ సహాయక సిబ్బంది వరకు అందరూ ఎంతగానో కష్టపడ్డారని కొనియాడాడు.

ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు అత్యంత ఒత్తిడితో కూడుతున్న పరిస్థితుల్లో ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించారని, అద్భుతమైన విజయాన్ని సాధించామని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఓటమి అంచుల్లో ఉన్న పరిస్థితుల నుంచి ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో పట్టువదలకుండా ఆడి పుంజుకున్నారని, భారత జట్టు స్వభావం ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్ ద్వారా స్పష్టమవుతోందని అన్నాడు. ఈ మేరకు వీవీఎస్ లక్ష్మణ్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.

సహజంగా ప్రపంచ కప్ గెలవడం ఒక ప్రత్యేక అనుభూతి అని, ఇక అత్యుత్తమంగా ఆడి ట్రోఫీని గెలవడం ఆటగాళ్లందరికీ కెరియర్‌లో ఎంతో ముఖ్యమైనదని వ్యాఖ్యానించాడు. విజయం అనంతరం ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగానికి గురయ్యారని ప్రస్తావించాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి, అలాగే సహాయక సిబ్బందికి, భావోద్వేగాలు ఎక్కువగానే ఉన్నాయని లక్ష్మణ్ అన్నాడు. చివరి బంతి వేశాక హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా కన్నీళ్లు కార్చడం, కెప్టెన్ రోహిత్‌ శర్మ మైదానాన్ని ఆప్యాయంగా హత్తుకోవడాన్ని చూశామని ప్రస్తావించాడు. కాగా వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జింబాబ్వేలో యువ టీమిండియా జట్టుతో ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News