నిరుద్యోగులను క్యూలైన్లలో నిలబెట్టడమే మోదీ అసలైన ‘అమృత కాలం’: రాహుల్ గాంధీ

  • నిరుద్యోగ వ్యాధి అంటురోగంగా మారిందన్న కాంగ్రెస్ అగ్రనేత
  • బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాధి కేంద్రకాలుగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు
  • గుజరాత్‌లో 10 ఉద్యోగాల కోసం 1800 మంది పోటీపడ్డ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ
దేశంలో నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతూ గుజరాత్‌లో ఒక కంపెనీలో 10 ఉద్యోగాల కోసం 1800 మంది అభ్యర్థులు పోటీ పడడంతో తోపులాటకు దారితీసింది. నిరుద్యోగుల తాకిడితో ఇంటర్వ్యు ప్రదేశంలోని రెయిలింగ్ విరిగిపోయిన దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో అధికార బీజేపీపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భవిష్యత్‌లో ఉద్యోగాల కోసం యువతను క్యూలైన్లలో నిలబెట్టడమే ప్రధాని మోదీ చెప్పే అసలైన ‘అమృత కాలం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.

దేశంలో నిరుద్యోగ రోగం అంటువ్యాధి రూపాన్ని సంతరించుకుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాధి కేంద్రకాలుగా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన హిందీలో స్పందించారు.

కాగా వైరల్‌గా మారిన ఈ వీడియోపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. గత 22 ఏళ్లుగా గుజరాత్‌ ప్రజలతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన 'చీటింగ్‌ మోడల్‌'కు ఈ వీడియోనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం యువత ఉద్యోగాలను లాక్కుంటోందని, వారి భవిష్యత్తును నాశనం చేస్తుందనడానికి ఈ వీడియోనే నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు హిందీలో స్పందించారు. 

ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ వాగ్దానం చేసిందని ఖర్గే మండిపడ్డారు. పేపర్ లీక్, నియామకాల్లో అవినీతి, విద్యలో మాఫియా, ప్రభుత్వ ఉద్యోగాలను ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పోస్టులను భర్తీ చేయకపోవడం, అగ్నివీర్ వంటి పథకాలను ప్రవేశపెట్టి కాంట్రాక్టుపై రిక్రూట్‌మెంట్.. ఇలా వీటన్నింటి ఫలితంగా యువత బలైపోతున్నారని, కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం  కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని ఖర్గే మండిపడ్డారు.


More Telugu News