10 ఉద్యోగాల కోసం పోటెత్తిన 1800 ఆశావాహులు!

  • అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించిన గుజరాత్‌లోని ఇంజినీరింగ్ సంస్థ
  • స్థానికంగా ఓ హోటల్‌లో ఇంటర్వ్యూల ఏర్పాటు
  • 10 పోస్టుల కోసం యాడ్ ఇస్తే 1800 మంది అభ్యర్థుల హాజరు
  • అభ్యర్థులు పోటెత్తడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ కూలిన వైనం
పది ఉద్యోగ ఖాళీల కోసం ఏకంగా 1800 మంది అభ్యర్థులు పోటెత్తిన షాకింగ్ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలకు దారి తీసింది. అంక్లేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో ఓ ఇంజినీరింగ్ కంపెనీ 10 పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే, దీనికి భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. లోపలికి వెళ్లేందుకు వారంతా ఒక్కసారిగా మెట్లపైకి వచ్చేశారు. ఈ క్రమంలో మెట్లపై అమర్చిన రెయిలింగ్ ‌పై కూడా కొందరు ఎక్కారు. బరువు తట్టుకోలేకపోయిన రెయిల్ ఒక్కసారిగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ మోడల్ పాలన కారణంగా గుజరాత్‌లో నిరుద్యోగిత పెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఘటనకు ఇంజినీరింగ్ కంపెనీయే కారణమని బీజేపీ ఎంపీ మన్‌సుఖ మాండవీయ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను సరిగా నిర్వహించలేదని ఆరోపించారు. ఘటనపై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవీ కూడా స్పందించారు. వీడియోతో రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అనుభవజ్ఞులను ఇంటర్వ్యూలకు పిలిచినట్టు కంపెనీ ప్రకటనలో స్పష్టంగా ఉందని, అలాంటప్పుడు వాళ్లందరూ నిరుద్యోగులని అనడం నిరాధారమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఉద్యోగార్హతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పత్రికాప్రకటనల్లో పేర్కొనాలని సూచించారు.


More Telugu News