అంబానీ ఇంట ఏడు నెలలపాటు పెళ్లి సందడి.. ఎప్పుడేం జరిగింది?

  • నేడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం
  • డిసెంబరులో నిశ్చితార్థంతో పెళ్లి వేడుకల మొదలు
  • ప్రతి ఆరు వారాలకు ఒక ఫంక్షన్
  • రేపు వధూవరుల దైవ ఆశీర్వాద కార్యక్రమం
  • ఆదివారం రిసెప్షన్‌తో వేడుకలకు ముగింపు
గతంలో పెళ్లి వేడుకలు 16 రోజులు జరిగేవి. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గుతూ మూడు రోజులకు చేరాయి. ఇప్పుడు ఏకంగా ఒక్క రోజుతోనే సరిపెట్టేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు పాత తరం ట్రెండ్ మొదలైంది. సంపన్నులు ఎక్కువగా రోజుల తరబడి పెళ్లి వేడుకల్లో మునిగిపోతున్నారు. ఇందులో భాగంగా రోజుకో వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట ఏడు నెలలుగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి.

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నేడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే, జనవరిలో నిశ్చితార్థం తర్వాత సగటున ప్రతి ఆరు వారాలకు వారి ఇంట ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. వారి నిశ్చితార్థ కార్యక్రమంలో రిహన్నా, జస్టిన్ బీబర్ వంటి పాప్‌స్టార్లు ఆడిపాడారు. ఇక బాలీవుడ్ స్టార్ల గురించి చెప్పక్కర్లేదు.

ఈ ఏడు నెలల్లో ఎప్పుడేం జరిగిందో ఒకసారి చూద్దాం

డిసెంబర్‌: ఎంగేజ్‌మెంట్
ఉత్తర రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో గతేడాది డిసెంబర్ 29న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థం జరిగింది. దీనికి ఇరు కుటుంబాల వారు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

జనవరి: ఎంగేజ్‌మెంట్ పార్టీ
జనవరి 18న వధువు రాధిక మర్చంట్‌కు మెహందీ వేడుక నిర్వహించారు. ఆ తర్వాతి రోజు ‘గోల్ ధన’ నిశ్చితార్థ వేడుక జరిపారు. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తదితర స్టార్లు హాజరయ్యారు.  

మార్చి: ప్రి వెడ్డింగ్ పార్టీ
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ప్రి వెడ్డింగ్ పార్టీకి దాదాపు 1200 మంది అతిథులు హాజరయ్యారు. బాలీవుడ్ నటీనటుల డ్యాన్సులు, బాణసంచా మెరుపులతో వేడుక జామ్‌నగర్‌కే కొత్త కళ తీసుకొచ్చింది. 100 మంది చెఫ్‌లు వండిన 500 వంటకాలను అతిథులకు వడ్డించారు. ఈ వేడుకల్లో రిహన్నా మరోమారు ప్రదర్శన ఇచ్చింది. టెక్ బిలియనీర్లు మార్క్ జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్, ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. పార్టీకి ముందు జామ్‌నగర్ బయట అంబానీ కుటుంబం 50 మందికిపైగా గ్రామస్థులకు విందు ఇచ్చింది.  
మే: యూరోపియన్ క్రూయిజ్ పార్టీ
అంబానీ కుటుంబం రోమ్‌లోని ఓ విలాసవంతమైన షిప్‌లో పార్టీ చేసుకుంది. సిసిలియన్ నగరమైన పలెర్మోర్‌లో ప్రారంభమైన షిప్ నాలుగు రోజుల అనంతరం రోమ్‌‌కు చేరుకుంది. ఈ పార్టీలో నో-ఫోన్ నిబంధన ఉన్నప్పటికీ పార్టీ ఫొటోలు లీకయ్యాయి. బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, పిట్‌బుల్, డేవిడ్ గుట్టా వంటివారి కాన్సెర్ట్‌లకు సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి.

 జులై 2-5: వివాహం, మ్యూజిక్ నైట్
జులై 2న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంట ముంబైకి 70 మైళ్ల దూరంలోని పాల్ఘడ్‌లో 50కి పైగా నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఇందులో ఏడాదికి సరపడా కిరాణా సామగ్రి నుంచి బంగారు ఆభరణాల వరకు బహుమతులుగా వారికి అందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో (అనంత్ తల్లి నీతా స్థాపించిన ముంబై ఆర్ట్స్ వేదిక) సంప్రదాయ మ్యూజిక్, డ్యాన్స్ నైట్ నిర్వహించారు. జస్టిన్ బీబర్ ప్రదర్శన ఇచ్చాడు

జులై 8: హల్దీ
అనంత్, రాధిక జంట సోమవారం హల్దీ వేడుకలో పాల్గొంది. ఈ వేడుకను ప్రైవేట్‌గా జరుపుకున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. రాధిక, అనంత్ అంబానీ ఇద్దరూ బంగారు, పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. రాధిక దుస్తులను భారతీయ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించగా, వరుడు అనంత్ కుర్తా, జాకెట్‌ను సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు.

శుక్రవారం: వివాహం
16 వేల మంది సామర్థ్యం గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది. పూర్తి రెడ్‌కార్పెట్ తరహాలో వివాహం జరగనుంది. అడిలె, డ్రేక్, లానా డెల్ రే వంటివారి ప్రదర్శన ఉంటుందని ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది.

శనివారం: దైవ ఆశీర్వాద కార్యక్రమం
నేడు వివాహం జరగనుండగా రేపు వివాహ ఘట్టంలోని చివరి దశ జరగనుంది. శుభ్ ఆశీర్వాద్‌గా పిలిచే దైవిక ఆశీర్వాద వేడుక రేపు (శనివారం) జరగనుంది. తమ సామాజిక వర్గంలోని పెద్దల నుంచి వధూవరులిద్దరూ ఆశీర్వాదాలు అందుకుంటారు.

ఆదివారం: రిసెప్షన్
ఏడు నెలలపాటు సదీర్ఘంగా జరిగిన వివాహ వేడుక ఆదివారం రిసెప్షన‌తో ముగియనుంది. శని, ఆదివారాల్లో జరిగే కార్యక్రమాలు అంబానీ కుటుంబానికి చెందిన 27 అంతస్తుల నివాసం యాంటిలియాలో జరుగుతాయని భావిస్తున్నారు.


More Telugu News