విండీస్ స్పిన్నర్ మ్యాజిక్ బాల్.. బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్.. ఇదిగో వీడియో

  • ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతి అనూహ్యంగా టర్న్ అయి మిడిల్ స్టంప్ ను గిరాటేసిన వైనం
  • ఆశ్చర్యంతో నమ్మలేక కాసేపు అలాగే చూస్తుండిపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్
  • అవుటైన విధానం రెండో రోజు ఆటకే హైలైట్.. నెట్టింట వీడియో వైరల్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ తో  జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయానికి చేరువైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్ లో 79 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరుకుంది. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 371 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 6 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కానీ బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. భారత్ తో సిరిస్ లో పెద్దగా రాణించని స్టోక్స్..  విండీస్ తో పోరులో తొలి ఇన్నింగ్స్ లో కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. కానీ అతను అవుట్ అయిన విధానమే ఈ మ్యాచ్ లో ప్రత్యేకించి రెండో రోజు ఆటలో హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

విండీస్ ఎడమచేతి వాటం స్పిన్నర్ గుడకేష్ మోతీ ఆఫ్ స్టంప్ అవతల విసిరిన బంతి.. గింగిరాలు తిరుగుతూ ఒక్కసారిగా స్టోక్స్ మిడిల్ స్టంప్ ను గిరాటేసింది. స్టోక్స్ షాట్ కు ప్రయత్నించగా బ్యాట్, ప్యాడ్ మధ్య గ్యాప్ లోంచి దూసుకెళ్లి క్లీన్ బౌల్డ్ చేసింది. బంతి అనూహ్యంగా టర్న్ కావడం, తాను క్లీన్ బౌల్డ్ కావడంతో స్టోక్స్ కూడా నమ్మలేకపోయాడు. ఒక్కసారిగా షాక్ కు గురై కాసేపు అక్కడే చూస్తుండిపోయాడు. పిచ్ వైపు నమ్మలేనట్లుగా చూసి తలాడిస్తూ క్రీజ్ నుంచి వెనుదిరిగాడు.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ చేసిన స్కోర్ ను సమం చేసేందుకు రెండో ఇన్నింగ్స్ లో ఇంకా 171 పరుగుల దూరంలో వెనకబడి ఉంది. ఈ లెక్కన మూడో రోజు మధ్యాహ్నంలోపే విండీస్ ఆలౌటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News