తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే?

  • దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ - ముంబై మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు రైల్వే ప్రతిపాదనలు
  • రాజ్‌‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ వరకూ, తిరుపతి-నిజామాబాద్ రైలును బోధన్ వరకూ పొడిగించే యోచన
వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి రైలును ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలును సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు సికింద్రాబాద్ - పూణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (చైర్ కార్) రానున్నట్టు తెలిసింది. 

కాగా, తిరుపతి - నిజామాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌‌లో ప్లాట్ ఫాం ఖాళీ లేక బోధన్‌కు తరలిస్తున్నారు. ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఇక సికింద్రాబాద్ - రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగించే రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌లోని పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్న రాజస్థానీలకు అత్యంత అనుకూలంగా మారింది. అయితే, ఈ రైలును కచ్ జిల్లా వరకూ పొడిగించాలని వారు కోరుతున్నారు. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలో చర్చకు రావడంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకూ, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ వరకూ పొడిగించేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం బదులిచ్చినట్టు తెలిసింది.


More Telugu News