వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది.. పరిస్థితిని మోదీకి వివరించాను: చంద్రబాబు

  • ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారన్న చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని మండిపాటు
  • నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామని వ్యాఖ్య
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని... ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించానని చెప్పారు. కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని... ఈ ప్రాజెక్టుకు రూ. 800 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. 

గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీయే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అబద్ధాలు చెప్పే నాయకుల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు.


More Telugu News