ఐఏఎస్ అధికారినని నమ్మించి పెళ్లి.. నాలుగేళ్ల తర్వాత బయటపడిన బండారం

  • హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఘటన
  • 2018లో బెల్జియంలో పనిచేస్తున్న ఆదోనికి చెందిన శ్రావణితో సందీప్‌కుమార్ వివాహం
  • వివాహ సమయంలో కట్నంగా రూ. 50 లక్షలు, ఇతర లాంఛనాలు
  • పెళ్లి తర్వాత రేడియాలజిస్ట్ అవతారం
  • నాలుగేళ్లుగా ఇంటికి ఒక్క పైసా కూడా తీసుకురాకపోవడంతో అనుమానించిన భార్య
  • అయినా, మరో రూ. 2 కోట్లు తీసుకున్న భర్త
  • చివరికి తల్లిదండ్రులతో పాటు కటకటాల్లోకి
తాను ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్టు ప్రచారం చేసుకున్నాడు. అలాగే నమ్మించి రూ. 50 లక్షల కట్నం తీసుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. తాజాగా, మరో డ్రామా ఆడి భార్య నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ శివారు బాచుపల్లిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ (38) ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్టు ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. వివాహం కోసం 2016లో ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్నాడు. అవి చూసి బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబ సభ్యులు సందీప్‌ను సంప్రదించారు. 2018లో శ్రావణితో సందీప్ వివాహమైంది. ఈ సందర్భంగా రూ. 50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు అందుకున్నాడు.

ఆ తర్వాత సందీప్ మరో నాటకానికి తెరతీశాడు. తనకు ఐఏఎస్‌గా ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని చెప్పి, రోజూ విధులకు వెళ్లి వస్తున్నట్టు నమ్మించాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇంటికి ఒక్క పైసా కూడా తేకపోవడంతో అనుమానించిన భార్య డబ్బులేం చేస్తున్నావని నిలదీస్తే..  తాను రూ. 40 కోట్లు సంపాదించానని, అయితే ఐటీ కట్టకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారని చెప్పాడు. ఆ డబ్బులు వెనక్కి రావాలంటే మరో రూ. 2 కోట్లు కావాలని చెప్పడంతో ఆమె ఏదో రకంగా సమకూర్చింది.

ఆ డబ్బును సందీప్ తన తండ్రి విజయ్‌కుమార్ (70), అమెరికాలో ఉంటున్న తన సోదరి లక్ష్మీసాహితి (35) ఖాతాలకు బదిలీ చేశాడు. ఇక, వివాహ సమయంలో తల్లిదండ్రులు శ్రావణికి పెట్టిన నగలను సందీప్ తల్లి మాలతి (59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన శ్రావణి భర్త ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్‌తోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. మరో నిందితురాలైన లక్ష్మీసాహితి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News