ప్రతి రోజూ మల విసర్జన చేయకపోతే ప్రమాదమా?

  • కాలకృత్యాలపై ప్రజల్లో అనేక సందేహాలు 
  • క్రమం తప్పకుండా కాలకృత్యం జరుగుతుంటే ఆందోళన అవసరం లేదంటున్న వైద్యులు
  • మలం రంగు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
  • నలుపు, ఎరుపు, స్ట్రా కలర్ రంగులు అంతర్గత ఇబ్బందులకు సంకేతాలని వివరణ
కాలకృత్యాలకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉంటాయి. కానీ మొహమాటం కారణంగా కొందరు వైద్యులతో కూడా తమ సమస్యను పూర్తిగా చెప్పుకోలేరు. అయితే, వైద్యుల ప్రకారం, జీవక్రియల్లో మలవిసర్జన ముఖ్యమైనది. కానీ కొందరిలో మలవిసర్జన క్రమం లేనట్టు అనిపిస్తుంది. ఇటువంటి వారు చివరకు తమ తీరును చూసుకుని ఆందోళన చెందుతుంటారు. 

అయితే, రోజుకు మూడు సార్ల నుంచి వారానికి మూడు సార్లు కాలకృత్యాలు తీర్చుకోవడం సహజమేనని వైద్యులు చెబుతున్నారు. ఎవరి శరీరలక్షణాలు వారివని, క్రమం తప్పకుండా మలవిసర్జన చేస్తున్నంతకాలం ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే, మలం రంగు మార్పు కనిపిస్తే మాత్రం అప్రమత్తమవ్వాలని చెబుతున్నారు. 

ముఖ్యంగా, నలుపు, లేదా ముదురు ఎరుపు, ఎండు గడ్డి రంగు, అసాధారణ రీతిలో దుర్వాసన, మలవిసర్జన సమయాల్లో తరచూ మార్పులు వంటివి చోటుచేసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. పేగుల్లో అంతర్గతంగా రక్తస్రావం జరిగితే మలం నలుపు రంగులోకి మారుతుంది. ఇక ఎరుపు రంగు.. హెమరాయిడ్స్, దిగువ పేగు భాగంలో రక్తస్రావం, కోలోరెక్టల్ క్యాన్సర్‌కు సంకేతం. ప్రాంక్రియాటిక్ గ్రంధుల్లో సమస్యలు అధిక దుర్వాసనకు కారణమవుతాయి. పై మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇక మలవిసర్జన సాఫీగా జరిగిపోవాలంటే తగినంత నీరు తాగాలి. కసరత్తులు చేస్తూ నిత్యం శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, అనారోగ్యకారక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. పెరుగు, యోగర్ట్ లాంటి ప్రోబయోటిక్ ఆహారాలు పేగులకు, జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడి తగ్గించుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక తరచూ మెడికల్ చెకప్‌లు చేయించుకుంటూ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచడం కూడా తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.


More Telugu News