150 టీ20లు గెలిచిన ఒకే ఒక్క జట్టుగా భారత్ సరికొత్త రికార్డు

  • జింబాబ్వేతో నిన్న జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం
  • భారత్ తర్వాత 142 విజయాలతో రెండో స్థానంలో పాకిస్థాన్
  • ఈ నెల 13, 14న వరుసగా చివరి రెండు మ్యాచ్‌లు
జింబాబ్వేతో నిన్న జరిగిన మూడో టీ20లో  విజయం సాధించిన భారత జట్టు 2-1తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఈ విజయంతో ఓ ఘనమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఏకంగా 150 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా అవతరించింది. భారత్ తర్వాత పాకిస్థాన్ 142 విజయాలతో రెండోస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ (111), ఆస్ట్రేలియా (105), సౌతాఫ్రికా (104) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో నిన్న జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శుభమన్‌గిల్ 66 పరుగులతో అదరగొట్టగా, గత మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ 10 పరుగులు మాత్రమే చేశాడు. జైస్వాల్ 36, గైక్వాడ్ 49 పరుగులు చేయడంతో భారత జట్టు 182 పరుగులు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లో ఈ నెల 13, 14న జరగనున్నాయి.


More Telugu News