జైలు ఫుడ్‌తో విరేచనాలు పట్టుకున్నాయి.. హైకోర్టులో కన్నడ హీరో దర్శన్ పిటిషన్

  • ఇంటి భోజనం, బెడ్, పుస్తకాలు అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్
  • జైలు చట్టాలు ఇందుకు అనుమతిస్తున్నాయని వాదన
  • జైలు ఆహారంతో బరువు తగ్గుతున్నానని ఫిర్యాదు
  • తానింకా విచారణ ఖైదీనేనని, నేరం రుజువు కాలేదని స్పష్టీకరణ
అభిమానిని హత్య చేసిన ఆరోపణలతో జైలు పాలైన కన్నడ సినీ నటుడు దర్శన్ తనకు ఇంటి నుంచి ఆహారం కావాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు ఆహారం కారణంగా తనకు విరేచనాలు పట్టుకున్నాయని పేర్కొన్నాడు. ఫుడ్‌తో పాటు బెడ్, పుస్తకాలు కూడా కావాలని తన పిటిషన్‌లో కోరాడు. అయితే, పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం పౌరులందరికీ నిబంధనలు ఒక్కటేనని స్పష్టం చేసింది. ఇదే రీతిలో కేసుపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. పిటిషన్‌పై జైలు అధికారులు, పోలీసులు, ప్రభుత్వానికి జస్టిస్ ఎస్ఆర్ శివకుమార్ నోటీసులు జారీ చేశారు. అనంతరం విచారణను వాయిదా వేశారు. 

అయితే, విచారణ ఖైదీలు, దోషులుగా తేలిన ఖైదీలకు సంబంధించిన నిబంధనల్లో వ్యత్యాసాలు ఉన్నాయని జస్టిస్ ఎస్ఆర్ శివకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాపడింది. ఈ మేరకు తుది నిర్ణయం ఉంటుందని పేర్కొంది. జైల్లో ఇంటి ఫుడ్‌ అనుమతికి సంబంధించి ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించాలని దర్శన్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఇంటి భోజనాన్ని అనుమతించే నిబంధన ఉంటే ఆ మేరకు అనుమతిస్తామని కోర్టు పేర్కొంది. 

మరోవైపు, దర్శన్ తరపు లాయర్ తమ వాదనలు వినిపిస్తూ జైలు ఫుడ్ తన క్లైంట్‌కు సరిగా జీర్ణం కావట్లేదని పేర్కొన్నారు. దీంతో, విరేచనాల బారినపడ్డారని తెలిపారు. అతడి బరువు కూడా బాగా తగ్గుతోందని, ఇదే తీరు కొనసాగితే అతడి ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉందని అన్నారు. ఇంటి భోజనం కావాలంటూ దర్శన్ మౌఖికంగా చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతనికి ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. 

జైళ్ల చట్టం 1963లోని సెక్షన్ 30 ప్రకారం, ఖైదీలకు బయటి ఆహారం, దుస్తులు, బెడ్‌ అనుమతించొచ్చని అన్నారు. ఈ కేసులో దర్శన్‌ ఇంకా దోషిగా తేలని విషయాన్ని కూడా ప్రస్తావించారు. దర్శన్‌కు ఇంటి నుంచి భోజనం, పుస్తకాలు, బెడ్, న్యూస్‌పేపర్లు అనుమతిస్తే ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇందుకు అనుమతించకపోవడం అమానవీయమని, రాజ్యంగంలోని 21వ అధీకరణను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.


More Telugu News