సైనాతో సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి

  • క్రీడలపై తనకున్న ఆసక్తిని చాటుకున్న రాష్ట్రపతి ముర్ము
  • సైనా నెహ్వాల్ తో స్నేహపూర్వక మ్యాచ్
  • పాయింట్ సాధించగానే ప్రేక్షకుల హర్షధ్వానాలు
  • వీడియో విడుదల చేసిన రాష్ట్రపతి కార్యాలయం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము క్రీడలపై తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. ర్యాకెట్ పట్టి కాసేపు బ్యాడ్మింటన్ కోర్టులో సరదాగా మ్యాచ్ ఆడారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత సైనా నెహ్వాల్ తో రాష్ట్రపతి భవన్ లోని బ్యాడ్మింటన్ కోర్టులో స్నేహపూర్వక పోటీలో తలపడ్డారు.

నిత్యం చీరలో కనిపించే ముర్ము ఈ మ్యాచ్ ఆడేందుకు సౌకర్యవంతంగా ఉండేలా సల్వార్ కమీజ్ ధరించారు. అలాగే కాళ్లకు షూ ధరించి కోర్టులో కలియదిరిగారు. ముందుగా సర్వ్ చేసిన ముర్ము.. ఆ తర్వాత ఒక పాయింట్ సాధించగానే ప్రేక్షకులంతా హర్షధ్వానాలు చేశారు. మరో రెండు పాయింట్లు సాధించినప్పుడు కూడా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్ కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది. దేశంలోని చిన్నారులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకొనేందుకు క్రీడలను ఎంపిక చేసుకొనేలా వారిలో స్ఫూర్తినింపేందుకు రాష్ట్రపతి ఈ మ్యాచ్ ఆడినట్లు వివరించింది.

రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో శుక్రవారం హర్ స్టోరీ–మై స్టోరీ పేరిట లెక్చర్ సిరీస్ ప్రారంభం కానుంది. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత అయిన సైనా నెహ్వాల్ ఈ కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకోనుంది. మహిళా పద్మ పురస్కార విజేతలు వారి విజయగాథలతో కోట్లాది మంది యువతలో స్ఫూర్తినింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.


More Telugu News