వైసీపీ ప్రోద్బలంతోనే ఆ కథనం ప్రచురించారు: నారా లోకేశ్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ లో కథనం
  • ఈ కథనాన్ని తాము ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నామని లోకేశ్ వెల్లడి
  • విశాఖ బ్రాండ్ ఇమేజిని నాశనం చేయడానికే కథనం తీసుకువచ్చారని ఆగ్రహం
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంటోంది అంటూ డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనాన్ని తాము ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. అలజడి సృష్టించడానికి, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజిని నాశనం చేయడానికి వైసీపీ ప్రోద్బలంతో ప్రచురించిన స్వచ్ఛమైన పెయిడ్, కల్పిత కథనం అని లోకేశ్ వివరించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం అందిస్తామని ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీలో మడమ తిప్పడం అనేదే లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేం మాట ఇచ్చాం... నిలబెట్టుకుంటాం అని ఆయన ఉద్ఘాటించారు. 

మన రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్న బ్లూ మీడియా సృష్టించిన ఈ ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని ఏపీ ప్రజలను కోరుతున్నానని తెలిపారు.

వైజాగ్ లో డెక్కన్ క్రానికల్ కార్యాలయం డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరుతున్నానని తెలిపారు. నిరాధార, పక్షపాత ధోరణితో కథనాలు ప్రచురించే బ్లూ మీడియా సంస్థలపై తాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


More Telugu News