టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమాచార, ప్రజా సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డికి సహకరించిన ఇతర ఉద్యోగులను కూడా విచారించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.  

ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా... విజయ్ కుమార్ రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. 

ధర్మారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. విజయ్ కుమార్ రెడ్డి ఇటీవలే కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చారు. 

టీటీడీని అడ్డంపెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్ తో సంబంధం లేకుండా కాంట్రాక్టులు ఇచ్చారని ధర్మారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. శ్రీవాణి టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.  

ఇక, సమాచార శాఖలో అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనల పేరిట కోట్లాది రూపాయల మేర విజయ్ కుమార్ అవినీతి చేశారని ఆరోపణలు వచ్చాయి.


More Telugu News