భారత్-రష్యా సంబంధాలపై స్పందించిన అమెరికా

  • భారత్-రష్యా మైత్రిపై ఆందోళన ఉన్నప్పటికీ తమది వ్యూహాత్మక భాగస్వామ్యమని వెల్లడి
  • రష్యాతో సంబంధాలపై తమకు పూర్తి స్పష్టత ఉందన్న అగ్రరాజ్యం
  • భారత ప్రధాని మోదీ రష్యాతో పాటు జెలెన్‌స్కీతోనూ మాట్లాడారన్న అమెరికా
భారత్-రష్యా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ... భారత్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు భారత్-రష్యా అధినేతల సమావేశం, సన్నిహిత సంబంధాలపై స్పందించాయి.

భారత్, రష్యా మధ్య ఎంతోకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ అన్నారు. తమ వరకు భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అన్నారు. రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలపై తమకు పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. ఈ వారం నాటో శిఖరాగ్ర సదస్సు సమయంలో... మోదీ మాస్కో పర్యటనపై ప్రపంచం దృష్టి సారించిందన్నారు.

ప్రపంచ దేశాలకు తాము దూరం కాలేదని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధ నిర్ణయమే ప్రపంచానికి రష్యాను దూరం చేసిందన్నారు. దీనికి రష్యా ఎంతో మూల్యం చెల్లిస్తోందన్నారు. భారత ప్రధాని మోదీ కేవలం రష్యాతోనే కాకుండా జెలెన్‌స్కీతో కూడా మాట్లాడారని గుర్తు చేశారు. శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందనే భరోసా కల్పించిందన్నారు.

భారత్-రష్యా సంబంధాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ... తమకు స్పష్టత ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. రష్యాతో మైత్రి కొనసాగింపుపై తమ ఆందోళనను భారత్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు.


More Telugu News