మా నాన్న చివరి కన్నీటి చుక్క గుర్తుకొస్తూనే ఉంది: కాంతారావు కూతురు సుశీల

  • కాంతారావుగారు గుడిబండ దొర 
  • సినిమాలు తీయడానికి పొలాలు అమ్మేశారు 
  • అప్పట్లో ఎకరం రేటు 1200
  • అమ్మేసిన తరువాత అటువైపు రేట్లు పెరిగాయి 
  • అమ్మగురించే బాధపడ్డాడని చెప్పిన సుశీల   

కాంతారావు .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ తరువాత కనిపించే పేరు .. వినిపించే పేరు. తెలుగు సినిమా కళామతల్లికి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండుకళ్లు అయితే, నుదుటున తిలకం కాంతారావు అని దాసరి నారాయణరావు ఒక సందర్భంలో అన్నారు. అలాంటి కాంతారావు చివరి రోజుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారు. ఆ విషయాలను గురించి 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూతురు సుశీల ప్రస్తావించారు. 

" మా నాన్నగారు 'గుడిబండ దొర' .. అప్పట్లోనే ఆయనకి 400 ఎకరాలు ఉండేది. విజయవాడకి ఏదైనా కొత్త సినిమా వస్తే, స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లేవారు. ఆ డబ్బు కోసం ఒక ఎకరం అమ్మేసేవారు .. అప్పట్లో ఎకరం 1200. అలా నాన్న సినిమాల్లోకి వచ్చి .. నిర్మాతగా మారే సమయానికి ఒక 50 ఎకరాలు ఉండేవనుకుంటా. సినిమాలు తీయడం కోసం ఆయన వాటిని కూడా అమ్మేశారు. ఆయన అమ్మేసిన తరువాత అటు వైపు సాగర్ కాలువ రావడం .. రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది" అన్నారు. 

"నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు సినిమా వాళ్లు కొంతమంది సాయం చేశారు. అంతకంటే ఎక్కువగా అభిమానులు ఆదుకున్నారు. ఆయన ప్రాణం పోతున్నప్పుడు అందరం దగ్గరే ఉన్నాం. అమ్మని తాను జాగ్రత్తగా చూసుకుంటానని అన్నయ్య చెప్పినప్పుడు, ఆయన కళ్లవెంట నీళ్లు చెంపల మీదుగా జారిపోయాయి. అది నేను ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాను. మా అమ్మ అమాయకురాలు .. తనకి ఏమీ తెలియదు. ఆమెను గురించే ఆయన చివరి రోజుల్లో బాధపడ్డారు" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 



More Telugu News