కరెంట్ కోతలు విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం: హరీశ్ రావు

  • ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ లేదని వెల్లడి
  • ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునేవారే కరవయ్యారన్న హరీశ్ రావు
  • ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టండని సూచన  
రాజధాని నగరం హైదరాబాద్‌లో కరెంట్ కోతలు విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు.

విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరవయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంటల కొద్దీ విద్యుత్ అంతరాయాలు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని హరీశ్ రావు జత చేశారు.

ఓయూలో పోలీసుల తీరును ఖండిస్తున్నాం

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్ రావు మరో ట్వీట్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే ఆ జర్నలిస్టులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అన్నారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News