ఏపీలో పెట్టుబడులకు బీపీసీఎల్ ఆసక్తి... శుభసూచకమన్న ఎంపీ బాలశౌరి

  • నేడు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న బీపీసీఎల్ చైర్మన్, ప్రతినిధులు
  • బీపీసీఎల్ బృందాన్ని ఆలయానికి తీసుకొచ్చిన ఎంపీ బాలశౌరి
  • రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉందని బాలశౌరి వెల్లడి 
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆసక్తి చూపిస్తోంది. కాసేపట్లో బీపీసీఎల్ ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది.

ఈ క్రమంలో, బీపీసీఎల్ చైర్మన్, ఇతర ప్రతినిధులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. జనసేన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వారిని దుర్గమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని వెల్లడించారు. రిఫైనరీ ఏర్పాటైతే సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 

రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుండడం శుభసూచకమని బాలశౌరి అన్నారు. పవన్ కల్యాణ్, ఎన్డీయే ఎంపీల చొరవతో బీపీసీఎల్ రాష్ట్రం వైపు ఆసక్తి చూపిస్తోందని వివరించారు.


More Telugu News