సమంతకు సారీ చెప్పిన 'ది లివర్ డాక్టర్'

  • ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై పోస్టు పెట్టిన సమంత
  • సమంతను జైల్లో పెట్టాలన్న డాక్టర్ సిరియాక్
  • ఆ వైద్యుడికి బదులిచ్చిన సమంత
  • సమంతను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదంటూ తాజాగా పోస్టు పెట్టిన డాక్టర్ 
  • తప్పుడు సలహాలు ఇచ్చే డాక్టర్లను ఎదుర్కోవడమే తన లక్ష్యమని వెల్లడి
ప్రముఖ నటి సమంత ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదం కావడం తెలిసిందే. సంప్రదాయేతర వైద్య విధానాలు కూడా మెరుగైన ఫలితాలను ఇస్తాయంటూ ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి వివరించారు. 

అయితే, ఆన్ లైన్ లో 'ది లివర్ డాక్టర్' గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్... సమంత పోస్టును తప్పుబట్టారు. సమంత ఏమన్నా వైద్య శాస్త్రం చదివిందా? ఫలానా మందులు వాడాలని ఆమె ఎలా సూచిస్తారు? రోగుల ప్రాణాల మీదికి వస్తే ఎవరిది బాధ్యత? ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలి అంటూ ఆ వైద్యుడు నిప్పులు చెరిగారు. 

ఆ వైద్యుడి వ్యాఖ్యలకు సమంత కూడా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. సమంతకు క్షమాపణ చెప్పారు. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. 

ఆన్ లైన్ లో వైద్యులుగా చెప్పుకునే వారు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుంటారని, చాలాకాలంగా తాను అలాంటి వారిపై పోరాడుతున్నానని వివరించారు. ఇక, సమంత తన పోస్టులో ఇద్దరు డాక్టర్ల (డాక్టర్ మిత్రా బసు చిల్లర్, డాక్టర్ జోకర్స్) ను ఉదహరించారని, వారి ద్వారా తెలుసుకున్న విషయాలనే తాను పోస్టులో పేర్కొన్నట్టు సమంత చెబుతున్నారని డాక్టర్ సిరియాక్ వివరించారు. 

దాంతో కొందరు నెట్టిజన్లు... ఆ ఇద్దరు డాక్టర్ల సంగతేంటో చూడండి అని తనను కోరారని  డాక్టర్ సిరియాక్ వెల్లడించారు. కానీ, సమంత ఆ 'డాక్టర్లు' చెప్పిన విషయాలను నిర్ధారణ చేసుకోకుండానే పోస్టు చేయడంతో తాను స్పందించానని వివరణ ఇచ్చారు. 

సమంత ఆరోగ్య పరిస్థితి పట్ల తాను సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యవంతురాలవ్వాలని కోరుకుంటున్నానని డాక్టర్ సిరియాక్ తన పోస్టులో పేర్కొన్నారు. 

"నా అభిప్రాయాలను ఆమె మరోలా అర్థం చేసుకుని ఉంటే క్షమించమని కోరుతున్నాను. బాధాకరమైన ఆమె అనారోగ్య పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకుంటూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న డాక్టర్లను వదిలించుకోమని చెప్పడమే నా ఉద్దేశం" అని డాక్టర్  సిరియాక్ స్పష్టం చేశారు.


More Telugu News