పుతిన్ సమక్షంలో ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • రణక్షేత్రంలో యుద్ధానికి పరిష్కారం దొరకదని సూచన
  • చర్చలు, దౌత్యమే మార్గమని పుతిన్‌కు చెప్పిన ప్రధాని మోదీ
  • రష్యా-భారత్ ద్వైపాక్షిక సమావేశం అనంతరం మోదీ కీలక వ్యాఖ్యలు
ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారు. రణక్షేత్రంలో యుద్ధానికి పరిష్కారం దొరకదని, చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కార మార్గాలని పుతిన్‌కు మోదీ సూచించారు. ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ విషయంలో సహకరించేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తన స్నేహితుడు పుతిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఇరుదేశాధినేతలు పాల్గొన్న ద్వైపాక్షిక స‌మావేశం ముగిసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

‘‘ ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్ శాంతికి అనుకూలమని ప్రపంచ సమాజానికి హామీ ఇస్తున్నాను. నా స్నేహితుడు పుతిన్ నిన్న(సోమవారం) శాంతిపై మాట్లాడిన మాటలు నాలో ఆశను కలిగించాయి. ఆ విషయాన్ని మీడియా మిత్రులకు చెప్పాలనుకున్నాను’’ అని వ్యాఖ్యానించారు. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రధాని మోదీ మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2022లో షాంఘై శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ స్పందించారు. ఇది యుద్ధ యుగం కాదని, చర్చలే మార్గమని సూచించారు. ఆ సమయంలో ప్రధాని మోదీపై సర్వత్రా ప్రశంసలు కూడా కురిశాయి.

కాగా ప్రధాని మోదీ రెండు రోజుల రష్యా పర్యటన మంగళవారం ముగిసింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులు, పరిశోధనలతో పాటు అనేక కీలక రంగాలలో మొత్తం 9 అవగాహన ఒప్పందాలు, ఒప్పందాలు కుదిరాయి. కాగా రష్యా నుంచి ప్రధాని మోదీ నేరుగా ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు.


More Telugu News