నేనొక్కడినే చేస్తానని చెప్పడం లేదు... కాంగ్రెస్ నేతల సహకారం తీసుకుంటాను!: బండి సంజయ్

  • రాజకీయ విమర్శలు చేసుకునే సమయం కాదన్న బండి సంజయ్
  • రాష్ట్రమైనా, కేంద్రమైనా అభివృద్ధి గురించే ఆలోచించాలని సూచన
  • కొండగట్టును, వేములవాడను కచ్చితంగా అభివృద్ధి చేస్తానని హామీ
  • అందరం కలిసి ఉందాం.. కలిసే ముందుకు సాగుదామని సూచన
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి తానొక్కడినే చేస్తానని చెప్పడం లేదని... కాంగ్రెస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, తన లోక్ సభ నియోజకవర్గంలోని అందరు ఎమ్మెల్యేల సహకారంతో ముందుకు సాగుతానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాయని... రాజకీయ విమర్శలు చేసుకునే సమయం అయిపోయిందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో తనను గెలిపించినందుకు ఆయన కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందరి సహకారంతోనే అభివృద్ధి పనులు సాధ్యమవుతాయన్నారు.

తాను కేవలం పేరు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ఇప్పుడు రాజకీయాలు చేయవద్దని... రాష్ట్రమైనా, కేంద్రమైనా ఇప్పుడు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాలని సూచించారు. ఏ పదవి వచ్చినా తనకు గర్వం, అహంకారం ఉండవన్నారు. తనకు వచ్చిన పదవిని ఒక గొప్ప బాధ్యతగా తాను భావిస్తానన్నారు. కొండగట్టును, వేములవాడను కచ్చితంగా అభివృద్ధి చేస్తానన్నారు.

కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న... వీరు కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లని... పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు. ఆలయం అభివృద్ధికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు.  తాను ఎప్పుడూ పేరు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ఇతర పార్టీల సహకారం కూడా తీసుకుంటానని.. కానీ తానొక్కడినే చేస్తానని ఎప్పుడూ చెప్పడం లేదన్నారు.

మనం చేసిన పనిని ప్రజలు గుర్తించాలని మంత్రి అన్నారు. తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చిన వ్యక్తినన్నారు. అన్ని పార్టీల నాయకులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... అందరం కలిసి ఉందామని, కలిసే ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం కోసమో... ఎన్నికల్లో గెలవడం కోసమో... అధినాయకత్వం మన్నన పొందేందుకో... మనం పని చేయకూడదన్నారు. మనల్ని గెలిపించిన ప్రజలకు మనం సేవ చేయాలన్నారు.


More Telugu News