ముంబై బీఎండబ్ల్యూ యాక్సిడెంట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

  • మహిళను 1.5 కి.మీ. లాక్కెళ్లిన కారు
  • బానెట్ కు చిక్కుకున్న మహిళను విడదీసిన మిహిర్ షా
  • ఆమె శరీరంపై నుంచి మరోమారు కారు నడిపిన డ్రైవర్
ముంబైలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివసేన (షిండే వర్గం) పార్టీ నేత రాజేశ్ షా కొడుకు మిహిర్ షా ఈ ప్రమాదానికి కారణమన్న సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజాము వరకు ఫ్రెండ్స్ తో బారులో మద్యం సేవించిన మిహిర్ షా.. ఇంటికి వెళ్లే క్రమంలో బీఎండబ్ల్యూ కారును నడిపాడని పోలీసులు చెప్పారు. డ్రైవర్ ను పక్కన కూర్చోబెట్టుకుని వేగంగా దూసుకెళ్లాడని వివరించారు. వర్లీ ఏరియాలో స్కూటీని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయాడని చెప్పారు.

ఈ ప్రమాదంలో కావేరీ నక్వా అనే మహిళ బీఎండబ్ల్యూ కారు బంపర్ కు, ఇంజిన్ కు మధ్య చిక్కుకుందని తెలిపారు. బానెట్ పై నుంచి మహిళ కనిపించినా కారు ఆపలేదన్నారు. కారు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతో ఈ విషయం బయటపడిందన్నారు. ఈ కేసులో నిందితులపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని కోర్టు ప్రశ్నించగా.. పోలీసులు ఈ వివరాలను కోర్టుకు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల మేర మహిళను అలాగే ఈడ్చుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కారును ఆపిన మిహిర్ షా.. బంపర్ కు చిక్కుకున్న మహిళను కిందకు లాగాడని చెప్పారు. ఆపై డ్రైవర్ రాజ్రిషి బిదావత్ స్టీరింగ్ తీసుకోగా.. మిహిర్ షా పక్కన కూర్చున్నాడని వివరించారు. కారును రివర్స్ చేసిన డ్రైవర్.. మరోమారు కావేరి పై నుంచి కారును పోనిచ్చాడని తెలిపారు. అనంతరం బోరీవలి వైపుగా వెళ్లారని, ఓ నిర్జన ప్రదేశంలో కారు వదిలి ఆటోలో పరారయ్యారని చెప్పారు. 

మిహిర్ షా బోరివలీలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాక ఫోన్ స్విచ్ఛాప్ చేశాడని, అక్కడి నుంచి ఎటు వెళ్లాడనేది తెలియడంలేదన్నారు. అంతకుముందు తండ్రి రాజేశ్ షాకు ఫోన్ చేసి మిహిర్ షా కారు ప్రమాదం గురించి చెప్పాడన్నారు. దీంతో రాజేశ్ షా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను మాయం చేసేందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని పోలీసులు ఆరోపించారు.

డ్రైవర్ రాజ్రిషి బిదావత్ కు అన్ని విషయాలు స్పష్టంగా తెలిసినా మిహిర్ షాకు సాయం చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిందితులపై ‘కల్పబుల్ హోమిసైడ్’ ఛార్జ్ పెట్టామని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి రాజేశ్ షా, రాజ్రిషి బిదావత్ లను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మిహిర్ షా కోసం పదకొండు టీమ్ లతో గాలిస్తున్నామని చెప్పారు.


More Telugu News