బలవంతంగా రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి!

  • సుమారు రెండు డజన్ల మందిని విడుదల చేయాలని రష్యా నిర్ణయం
  • రష్యా పర్యటనలో ఈ అంశాన్ని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాని మోదీ
  • ఉద్యాగాల పేరిట మోసగించి రష్యా సైన్యానికి అప్పగించిన ఏజెంట్లు
  • ఉక్రెయిన్ తో యుద్ధంలో ఇప్పటికే ఇద్దరు భారతీయుల మృతి
  • నేడు పుతిన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు, 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రసంగం
రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న సుమారు రెండు డజన్ల మంది భారతీయులకు విముక్తి లభించనుంది. వారందరినీ విడుదల చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేటు విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. దీంతో తమ సైన్యంలో పనిచేస్తున్న వారందరినీ వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకొనే ఏర్పాట్లు చేయాలని రష్యా నిర్ణయించినట్లు ఆ వర్గాలు వివరించాయి.

ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టినందుకు ఆయన్ను పుతిన్ ఈ విందు భేటీలో ప్రశంసించినట్లు తెలిసింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.

రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు రెండు డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యా వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా చేర్చుకుంది. వారికి యూనిఫాంలు, ఆయుధాలు అందించి యుద్ధభూమిలో సైన్యంతో కలిసి మోహరించింది.

ఇప్పటికే ఈ యుద్ధంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ ఈ ఏడాది తొలినాళ్లలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.

దీనిపై మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరింది. అలాగే అమాయక యువతను తప్పుదోవ పట్టించిన ఏజెంట్లు, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

రష్యాకు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ఓ ముఠాను భారత దర్యాప్తు సంస్థలు రట్టు చేశాయి. కనీసం 35 మంది భారతీయులను అక్రమంగా రష్యాకు పంపినట్లు ఆ దర్యాప్తులో తేలింది. అయితే వారందరినీ బలవంతంగా యుద్ధంలోకి దింపారా లేదా అనే విషయం తెలియరాలేదు.

పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే మాస్కోలో జరిగే 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.


More Telugu News