మట్టి గణపతిని పూజిద్దాం: ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్

  • త్వరలోనే వినాయకచవితి
  • నేడు మంగళగిరిలో పవన్ ను కలిసిన ప్రకృతి ప్రేమికుడు విజయ్ రామ్
  • ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై సూచన
త్వరలో వినాయక చవితి పర్వదినం రానున్న నేపథ్యంలో, అందరూ మట్టి గణపతినే పూజించాలని ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇవాళ పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయ్ రామ్ మంగళగిరిలో మంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు. పవన్ కల్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, త్వరలో వినాయక చవితి రాబోతోందని, ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా, జల కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని తెలిపారు. మట్టి గణపతికి పూజలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్టు పవన్ వెల్లడించారు. 

ఇక, దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారని, అయితే బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారని వివరించారు. బటర్ పేపర్ కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలని సూచించారు. వాటి వ్యర్థాల నిర్వహణ కూడా సులభమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నామని వెల్లడించారు. 

కాగా, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయ్ రామ్ ఇవాళ పవన్ ను కలిసిన సందర్భంగా... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణానికి హాని కలిగించని వస్తువుల వినియోగంపై తన ఆలోచనలు పంచుకున్నారు. 

అంతేకాదు, ప్రకృతి సేద్యం విధానంలో పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను కూడా పవన్ కు చూపించారు.


More Telugu News