రోమ్ నగరం ఒక్కరోజులో కట్టలేదు: అభిషేక్ శర్మ సెంచరీపై యువీ స్పందన

  • భారత క్రికెట్లో కొత్త సంచలనం... అభిషేక్ శర్మ
  • జింబాబ్వేపై 47 బంతుల్లో 100 పరుగులు చేసిన అభిషేక్
  • శిష్యుడ్ని అభినందించిన యువరాజ్ సింగ్ 
భారత క్రికెట్ వర్గాల్లో అభిషేక్ శర్మ పేరు మార్మోగుతోంది. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ లో డకౌట్ అయిన ఈ యంగ్ స్టర్... రెండో మ్యాచ్ లో రికార్డు సెంచరీతో అదరగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్ అరంగేట్ర మ్యాచ్ లో సున్నాకే అవుటైనప్పటికీ, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో మ్యాచ్ లో పరుగుల సునామీ సృష్టించాడు. 

23 ఏళ్ల అభిషేక్ శర్మ గురువు ఎవరో కాదు... ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. నిన్న సెంచరీ కొట్టగానే అభిషేక్ రెండు వీడియో కాల్స్ చేశాడు. ఒకటి కుటుంబానికి, రెండోది తన మెంటార్ యువరాజ్ సింగ్ కు. 

కాగా, తన శిష్యుడి వీరబాదుడుకు యువీ ముగ్ధుడయ్యాడు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించాడు. "రోమ్ నగరం ఒక్కరోజులోనే నిర్మితం కాలేదు. అలాగే, అభిషేక్ శర్మ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. కెరీర్ లో తొలి సెంచరీ సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ అభిషేక్ శర్మ. ఇలాంటి సెంచరీలు ఇంకా ఎన్నో రావాలి" అంటూ యువీ ఆశీస్సులు అందించాడు. అంతేకాదు, అభిషేక్ ట్రైనింగ్ సెషన్స్ లో ఎంత కష్టపడి సాధన చేశాడో తెలిపే వీడియోను కూడా పంచుకున్నాడు.


More Telugu News