ముంబైలో ‘హిట్ అండ్ రన్’.. పరారీలో శివసేన (షిండే) నేత కుమారుడు.. తండ్రి అరెస్ట్

  • స్నేహితులతో కలిసి పబ్‌లో ఎంజాయ్ చేసిన మిహిర్ షా
  • ఆదివారం తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తున్న జంటను ఢీకొట్టిన వైనం
  • అక్కడికక్కడే మృతి చెందిన 45 ఏళ్ల మహిళ
  • పరారీలో ఉన్న మిహిర్ కోసం ఆరు బృందాలతో గాలింపు
పూణె బాలుడి హిట్ అండ్ రన్ కేసును మర్చిపోకముందే ముంబైలో అలాంటిదే మరొకటి జరిగింది. ఈసారి నిందితుడు అధికార శివసేన (షిండే) నేత కుమారుడు కావడం గమనార్హం. శనివారం రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో ఎంజాయ్ చేసిన మిహిర్ షా (24) ఆదివారం తెల్లవారుజామున తన మెర్సిడెస్ కారులో వెళ్తూ వర్లిలో స్కూటర్‌పై వెళ్తున్న జంటను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ (45) ప్రాణాలు కోల్పోయింది.

పదో తరగతితో చదువు ఆపేసిన మిహిర్ షా శివసేన నేత రాజేశ్ షా కుమారుడు. ఘటన సమయంలో మిహిర్ తాగి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పబ్ యజమాని మాత్రం మిహిర్ తాగలేదని, రెడ్‌బుల్ మాత్రమే తీసుకున్నాడని అన్నాడు.

 స్నేహితులతో కలిసి బార్ నుంచి బయటకు వచ్చిన మిహిర్ బెంజ్‌కారులో వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన తర్వాత మిహిర్ పరారయ్యాడు. మిహిర్ తండ్రి రాజేశ్, కారు డ్రైవర్ రాజ్‌రిషి బిదావత్‌ను ప్రశ్నించిన అనంతరం వర్లి పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కారు రాజేశ్ పేరున రిజిస్టర్ అయి ఉంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ఆరు బృందాలతో గాలిస్తున్నారు.


More Telugu News