నాగోల్ గేటెడ్ కమ్యూనిటీలో చోరీ.. సీసీటీవీ కెమెరాలో చిక్కిన దొంగలు

  • ఇంటికి తాళంపెట్టి తిరుమల వెళ్లిన ఫ్యామిలీ
  • ప్రధాన ద్వారం విరగ్గొట్టి విల్లాలోకి చొరబడ్డ దొంగలు
  • 30 తులాల బంగారం, రూ.20 లక్షల విలువైన వజ్రాల చోరీ
గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు హల్ చల్ చేశారు. రాత్రి పూట రెండు విల్లాల్లోకి చొరబడి బంగారం, వజ్రాలు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల్లో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. నాగోలు ఠాణా పరిధిలో ఫతుల్లాగూడ గోల్డెన్‌ లీవ్స్‌ విల్లాస్‌లో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న విల్లాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. తొలుత 22 వ నెంబర్ విల్లాలోకి చొరబడ్డ దొంగలు.. లోపల విలువైన వస్తువులు దొరకకపోవడంతో 89వ నెంబర్ విల్లాలోకి ఎంటరయ్యారు.

ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు.. 30 తులాల బంగారం, రూ.20 లక్షల విలువైన వజ్రాలు, లక్ష నగదు దోచుకుని పారిపోయారు. తెల్లవారుజామున పనిమనిషి రాగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పక్కింటి వారికి చెప్పింది. వారు వెంటనే తిరుపతికి వెళ్లిన ఇంటి యజమాని హేమలతా రెడ్డికి సమాచారం అందించారు. దైవ దర్శనం చేసుకుని తిరుగుప్రయాణంలో ఉన్న హేమలతా రెడ్డి.. హైదరాబాద్ చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో దొంగల కోసం వేట మొదలుపెట్టారు.


More Telugu News