జింబాబ్వేపై గెలుపుతో పాక్, ఆస్ట్రేలియాల ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన భారత్

భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల ఆల్‌టైమ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

100కు పైగా పరుగుల తేడాతో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేపై తాజా విజయంతో మొత్తం ఐదు సార్లు వందకు పైగా పరుగుల తేడాతో విజయాలు అందుకుంది. దీంతో చెరో నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లను భారత్ అధిగమించింది. ఇక జాబితాలో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ చెరో మూడు సార్లు 100కుపైగా పరుగులతో విజయాలు సాధించాయి.

టీ20లలో అత్యధిక సార్లు 100+ పరుగుల విజయాలు..
1. భారత్ - 5 విజయాలు
2. పాకిస్థాన్ - 4 విజయాలు
3. ఆస్ట్రేలియా - 4 విజయాలు
4. ఇంగ్లండ్ - 3 విజయాలు
5. ఆఫ్ఘనిస్థాన్ - 3 విజయాలు

భారత్ గతేడాది అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై ఏకంగా 168 పరుగుల తేడాతో గెలిచింది. టీ20లలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్‌పై 143 పరుగులు, దక్షిణాఫ్రికాపై 106 పరుగులు, ఆఫ్ఘనిస్థాన్‌పై 101 పరుగులు, తాజాగా జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. 

కాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 234 పరుగులు చేసింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 4 బంతుల్లోనే సెంచరీ బాదడం, రుతురాజ్ గైక్వాడ్ 77, రింకూ సింగ్ 48 పరుగులు చేయడంతో భారత్ ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అయితే లక్ష్య ఛేదనలో 18.4 ఓవర్లలో 134 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది.


More Telugu News