అభిషేక్ శర్మ విధ్వంసక సెంచరీ... 20 ఓవర్లలో 234 కొట్టిన టీమిండియా

  • టీమిండియా, జింబాబ్వే మధ్య నేడు రెండో టీ20
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 47 బంతుల్లో 100 పరుగులు చేసిన అభిషేక్ శర్మ
  • విరుచుకుపడిన రుతురాజ్, రింకూ సింగ్
సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలోనూ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇవాళ టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసక సెంచరీతో అలరించాడు. అభిషేక్ శర్మ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

నిన్న జరిగిన తొలి టీ20లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ... ఇవాళ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఓ రేంజిలో ఉతికారేసిన అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో జింబాబ్వే బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

మరో ఎండ్ లో రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ సైతం తగ్గేదే లే అంటూ విరుచుకుపడడంతో టీమిండియా స్కోరు 200 మార్కు దాటింది. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 77 పరుగులు చేసి అజేయంగా నిలవగా... రింకూ సింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 1, మసకద్జా 1 వికెట్ తీశారు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 2 పరుగులకే అవుటయ్యాడు. ఓ దశలో టీమిండియా తొలి పవర్ ప్లేలో తక్కువ పరుగులే చేసింది. 6 ఓవర్లలో టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 36 పరుగులు. అక్కడి నుంచి టీమిండియా పరుగుల ప్రవాహం మొదలైంది. 

అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్లతో జింబాబ్వే బౌలర్లను బెంబేలెత్తించారు. అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం అవుటైనా... రుతురాజ్ కు రింకూ సింగ్ తోడవడంతో పరుగుల వెల్లువ కొనసాగింది.


More Telugu News