టెన్నిస్ ఆటగాళ్లకు ఆన్ లైన్ వేధింపుల నుంచి రక్షణ... వింబుల్డన్ లో ఏఐ

  • అన్ని రంగాల్లోనూ ఏఐ
  • ఆటగాళ్ల ఆన్ లైన్ వాతావరణాన్ని సురక్షితం చేసేందుకు ఏఐ టూల్
  • ఆటగాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్య, అవమానకర కామెంట్లకు అడ్డుకట్ట
ఇప్పుడు దాదాపు ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజ్యమేలుతోంది. క్రీడారంగంలోనూ ఏఐతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. తాజాగా, ప్రతిష్ఠాత్మక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ లోనూ ఏఐ సేవలు వినియోగిస్తున్నారు. ఎలాగంటే... ఆటగాళ్లకు ఆన్ లైన్ వేధింపుల నుంచి రక్షణ కలిగించేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. 

టెన్నిస్ ఆటగాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్య సందేశాలు, దూషణలు, వెక్కిరింతలు, అవమానకర వ్యాఖ్యలు, జాత్యహంకార వ్యాఖ్యలు, లైంగిక, ప్రాణహాని బెదిరింపులను ఏఐ టెక్నాలజీ సాయంతో అడ్డుకుంటారు. 

ఆటగాళ్ల ఖాతాలను ఈ ఏఐ టెక్నాలజీ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాచుర్యంలో ఉన్న 35 భాషలను వింబుల్డన్ ఏఐ టూల్ గుర్తించగలదు. వీటిలో  ఏ భాషలో  చెడు కామెంట్ చేసినా ఏఐ టూల్ వెంటనే ఫిల్టర్ చేస్తుంది.

తద్వారా, వింబుల్డన్ లో ఆడే టెన్నిస్ ఆటగాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో మంచి కామెంట్లు చేయగలరేమో కానీ... చెడు కామెంట్లు చేయడం ఏమాత్రం కుదరని పని. ఇకపై టెన్నిస్ ఆటగాళ్ల ఆన్ లైన్ వాతావరణాన్ని కలుషితం చేయడం అసాధ్యమని వింబుల్డన్ నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ పేర్కొంది. 

కాగా, వింబుల్డన్ లో ఉపయోగించే ఏఐ టూల్ ను యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలోనూ వినియోగించనున్నారు.


More Telugu News