జింబాబ్వేపై ఓటమికి కారణం అదేనట.. రవిబిష్ణోయ్ చెప్పేశాడు

  • తొలి టీ20లో జింబాబ్వే చేతిలో భారత్ దారుణ ఓటమి
  • బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడమే ఓటమికి కారణమన్న రవి బిష్ణోయ్
  • బౌలింగ్, ఫీల్డింగ్‌లో జింబాబ్వే అదరగొట్టిందని కితాబు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గతరాత్రి హరారేలో జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం ఏంటన్నది టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బయటపెట్టాడు. బ్యాటింగ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయామని, ఓటమికి అదే కారణమని పేర్కొన్నాడు.

‘‘ఇది మంచి గేమే. కాకపోతే బ్యాటింగ్‌లో కుప్పకూలిపోయాం. వికెట్లను వెంటవెంటనే కోల్పోయాం. నిజానికి మంచి భాగస్వామ్యాలు గేమ్‌ను నిలబెడతాయి. కానీ ఈ విషయంలో మేం విఫలమయ్యాం. దానివల్లే ఫలితం వ్యతిరేకంగా వచ్చింది’’ అని బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు. 

జింబాబ్వే బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నాయని రవి ప్రశంసించాడు. భాగస్వామ్యాలు నెలకొల్పే చాన్స్‌ను వారు తమకు ఇవ్వలేదని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్‌కు పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో బంతి మిగిలి ఉండగానే 102 పరుగులకు ఆలౌట్ అయింది.


More Telugu News