పెండింగ్ అంశాలపై చర్చించాం... రేవంత్ రెడ్డి, ఈ భేటీ ద్వారా నమ్మకం కలిగింది... చంద్రబాబు

  • సమావేశం అనంతరం తమ తమ నివాసాలకు చేరుకున్న ముఖ్యమంత్రులు
  • మంత్రులతో కలిసి చంద్రబాబు సహా ఏపీ ప్రతినిధులతో సమావేశమయ్యామన్న రేవంత్ 
  • ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై చర్చించామని చంద్రబాబు ట్వీట్
  • మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు రెండు గంటలు కొనసాగింది. ఆ తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లోని తమ తమ నివాసాలకు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం కలిగిందన్న చంద్రబాబు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపామని చంద్రబాబు ట్వీట్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయని, ఇరురాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందని పేర్కొన్నారు.

మంచి వాతావరణంలో సమావేశం జరిగింది: శ్రీధర్ బాబు

మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విభజన అంశాలపై అధికారుల కమిటీని వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరోసారి కూర్చొని చర్చిస్తారని తెలిపారు. ఏడు మండలాలు, విద్యుత్ బకాయిలు... ఇలా ప్రతి అంశంపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళతామన్నారు.


More Telugu News