మహిళా ప్రిన్సిపాల్‌ చేత బలవంతంగా సీటు ఖాళీ చేయించిన స్కూల్ యాజ‌మాన్యం.. అస‌లేం జ‌రిగిందంటే..!

  • యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఘటన
  • ఫిబ్రవరి 11న బిషప్ జాన్సన్ బాలికల స్కూల్‌ పరీక్షా కేంద్రంలో జరిగిన యూపీపీఎస్సీ పరీక్ష పేపర్ లీక్‌
  • ఈ స్కామ్‌లో ప్రిన్సిపాల్‌ పరుల్ సోలమన్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు
  • దాంతో ఆమెను ప్రిన్సిపాల్ ప‌ద‌వి నుంచి త‌ప్పించిన స్కూల్ యాజమాన్యం 
  • కానీ, పరుల్ మాత్రం త‌న సీటును ఖాళీ చేసేందుకు స‌సేమీరా
  • దాంతో చేసేదేమీలేక ఆమెను బ‌ల‌వంతంగా తొల‌గించిన వైనం
యూపీలోని ఓ బాలిక‌ల పాఠ‌శాల‌ మహిళా ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించి, ఆమె సీటు ఖాళీ చేయించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన యూపీపీఎస్‌సీ రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష నిర్వ‌హించింది. దీనిలో భాగంగా బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలకు కూడా పరీక్షా కేంద్రాన్ని కేటాయించింది. అయితే, ఈ ఎగ్జామ్ సెంట‌ర్‌లో పేపర్ లీక్‌ అయ్యింది. దాంతో స్కూల్ నిర్వాహకుడు వినీత్ జస్వంత్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, ఈ పేప‌ర్ లీకేజీలో పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్‌ పరుల్ సోలమన్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దాంతో స్కూల్ యాజమాన్యం ఆమెను ప్రిన్సిపాల్ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. ఆమె స్థానంలో షెర్లిన్ మాస్సేను కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించారు.

తాజాగా కొత్త ప్రిన్సిపాల్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రాగా.. పరుల్ సోలమన్ మాత్రం త‌న సీటును ఖాళీ చేసేందుకు స‌సేమీరా అన్నారు. దాంతో ఆ సంస్థ ఛైర్మన్ బిషప్ మారిస్ ఎడ్గార్ డాన్ నేతృత్వంలో స్కూల్‌ సిబ్బంది ప్రిన్సిపాల్ ఆఫీస్‌లోకి వ‌చ్చి ఆమెను సీటు ఖాళీ చేయాల్సిందిగా కోరారు. కానీ, ఆమె నిరాకరించారు. 

దాంతో చేసేదేమీలేక ఆమె చేతిలోని మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. అనంతరం పరుల్‌ కూర్చొన్న ఛైర్‌ను ముందుకు లాగి బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొత్త ప్రిన్సిపాల్ షెర్లిన్ మాస్సేను ఆ సీటులో కూర్చోబెట్టి అక్కడున్న సిబ్బంది ఆమెను అభినందించారు.  

ఇక ప్రిన్సిపాల్‌ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్‌ పోలీసులను ఆశ్ర‌యించారు. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News